కలం, వెబ్ డెస్క్: ఏరోస్పేస్ రంగంలో గ్లోబల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్ లోని సఫ్రాన్ విమాన ఇంజిన్ల తయారీ సెంటర్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులతో తెలంగాణలో పెట్టుబడికి అవకాశం, ప్రస్తుతం కొనసాగుతున్న తయారీ కార్యకలాపాల విస్తరణ, నూతన యూనిట్ల ఏర్పాటుపై భట్టి చర్చించారు. తెలంగాణలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ ఆసక్తి చూపుతున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.
హైదరాబాద్ లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సఫ్రాన్ కంపెనీ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు భట్టి (Bhatti Vikramarka) చెప్పారు. స్కిల్డ్ మానవ వనరులు, ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన బలాలు అని ఆయన చెప్పారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో సఫ్రాన్ సంస్థతో పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడి ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ఏరోస్పేస్ తయారీ రంగం మరింత విస్తరిస్తుందని భట్టి పేర్కొన్నారు.

