కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో (Miyapur Fire Accident) ఉన్న హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్ సమీపంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెయింట్ దుకాణంలో మంటలు వ్యాపించాయి. పెయింట్ దుకాణంలో కొత్త సైన్ బోర్డును అమర్చేందుకు కార్మికులు వెల్టింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెల్డింగ్ సమయంలో ఎగిసిన నిప్పురవ్వలు ప్రమాదవశాత్తు లోపల నిల్వ ఉంచిన రసాయనాలు, పెయింట్ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. త్వరగా మండే స్వభావం ఉన్న రసాయనాలు కావడంతో క్షణాల్లోనే మంటలు మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వ్యాపించి దుకాణమంతటా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో స్థానికులు, చుట్టుపక్కల వ్యాపారులు తీవ్ర భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో సమీపంలోని ఇతర భవనాలకు ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే దుకాణంలోని విలువైన పెయింట్ సామాగ్రి పూర్తిగా కాలిబూడిదై భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. భవనంలో కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు.. షాపు అనుమతులు , ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

