కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ అందుతోంది. ఈ మేరకు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ తెలంగాణ సీఐడీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన సుమారు రూ.447 కోట్ల కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ.. ఈ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.65 లక్షల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే బాధితుల డిపాజిట్ బాండ్ (AgriGold Bonds) పత్రాల పరిశీలన ప్రక్రియకు సీఐడీ డైరెక్టర్ సమగ్ర షెడ్యూల్‌ను ప్రకటించారు.
ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కేంద్రాలలో పత్రాల ధృవీకరణ, నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా ఏ తేదీల్లో ఎక్కడ వెరిఫికేషన్ నిర్వహిస్తారు, ఆయా కేంద్రాలలో పర్యవేక్షించే అధికారులు ఎవరనే పూర్తి వివరాలను సీఐడీ తన అధికారిక పోర్టల్ లో స్పష్టం చేసింది. బాధితులు తమకు కేటాయించిన తేదీలు, కేంద్రాల వివరాలను ముందుగానే సరిచూసుకొని, నిర్ణీత సమయానికి అధికారుల ఎదుట హాజరుకావాలని అధికారులు సూచించారు. పరిశీలనకు వచ్చే సమయంలో బాధితులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ అగ్రిగోల్డ్ డిపాజిట్ బాండ్ పత్రాలు, నగదు చెల్లించిన రశీదులు, అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు.

