కలం, వెబ్ డెస్క్: అమెరికాలో భారత పౌరుడు నిఖిల్ గుప్తా (Nikhil Gupta కు న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు 19 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఖలీస్థాన్ వేర్పాటువాది, సిక్కు నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా కుట్ర చేశాడనేది ఫెడరల్ పోలీసులు ఆయనపై అభియోగాలు మోపారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు.. హత్య కుట్ర నిజమేనని నిఖిల్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. నేరం రుజువు కావడంతో ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఖలీస్థాన్ కోసం గురుపత్వంత్ పోరాటం..
కోర్టు విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం.. “వికాష్ యాదవ్ అనే భారత ప్రభుత్వ ఉద్యోగి సూచనలతో నిఖిల్ గుప్తా గురుపత్వంత్ సింగ్ను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. గురుపత్వంత్ సింగ్ అమెరికా పౌరుడు, అటార్నీగా కూడా పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వంతో తరచూ విమర్శించడమే కాకుండా, సిక్కుల కోసం ఖలీస్థాన్ పేరిట ప్రత్యేక దేశం కావాలని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వేర్పాటువాద సంస్థను భారత్ నిషేధించడమే కాకుండా.. ఆయనపై కూడా పలు ఆంక్షలు విధించింది” అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. భారత నిఘా సంస్థ రా సూచనల మేరకే నిఖిల్ గుప్తా తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పలుమార్లు ఆరోపించారు. ఈ వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది.

