కలం, వెబ్‌డెస్క్: సమాజంలోని బలహీన వర్గాలకు ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Jeevitha Bheema) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే బీమాకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సదరు వ్యక్తి మరణానంతరం నామినీగా పేర్కొన్న వారికి బీమా మొత్తాన్ని అందజేస్తారు. అయితే నామినీల్లో ఒకరికి కంటే ఎక్కువ మందిని చేర్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీమా (Indiramma Bheema) కోసం పూర్తి ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందిరమ్మ బీమాకు దరఖాస్తు చేసుకున్నా వివిధ పథకాల కింద ఉన్న ప్రమాద బీమా సౌకర్యాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రస్తుతం పథకం అమలు చేస్తున్న ఇతర బీమా పథకాలను కొనసాగిస్తూనే, వాటిని ఇందిరమ్మ జీవిత బీమా పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించనుంది. ఇప్పటికే ఈ పథకం నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. డిసెంబర్ 18 వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, నామినీ వివరాలతో అర్హులు నమోదు చేసుకోవచ్చు.
Also Read : చిన్న ఏనుగుకు పెద్ద కష్టం.. విమానంలో తరలించి చికిత్స
Follow Us On: Youtube

