కలం, మిర్యాలగూడ : పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రవేశపెట్టిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Batthula Laxma Reddy) తెలిపారు. శనివారం మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని బంగారుగడ్డ వార్డులో నిర్వహించిన అవగాహన సదస్సు, నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Batthula Laxma Reddy) మాట్లాడుతూ… సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, వాటిలో 1,500 ఇండ్లకు డిసెంబర్ 9న భూమి పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్నారు.
ఈ నెల 19న ముఖ్యమంత్రి ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం అర్హులని తెలిపారు. గతంలో ఇతర బీమా పథకాలు ఉన్నప్పటికీ ఇది వర్తిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల జీవిత బీమా అందుతుందన్నారు.
18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉండి, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కలిగిన కుటుంబాలు నమోదు చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వారికి తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, ఆర్డీవో రమణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : పెళ్లి పీటలెక్కనున్న సచిన్ కుమార్తె.. వరుడు ఎవరంటే?
Follow Us On : WhatsApp

