కలం, బజార్హత్నూర్: ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అండగా నిలిచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని బజార్హత్నూర్ (Bazarhatnoor) మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఎలాంటి పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తుందని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. వెనుకబడిన బోథ్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా అర్హులైన వారికి చేయూత పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. పెన్షన్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన నిరుపేదలకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి కుటుంబం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, డీఆర్టీఓ రవీందర్ రాథోడ్, తహశీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

