కలం, కరీంనగర్ బ్యూరో: నూతన ఇంటి ఇంటీరియర్ పనులు (Interior Work Dispute) పూర్తి చేస్తామని ఒప్పందం కుదుర్చుకుని రూ.9 లక్షలు తీసుకున్న అనంతరం పనులను అర్ధాంతరంగా నిలిపివేసి, మరింత డబ్బు కోసం వేధిస్తున్నారంటూ బాధితుడు శుక్రవారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి స్వగ్రామమైన దాసరి శ్రీకాంత్ (39) ప్రస్తుతం కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో నివాసం ఉంటున్నారు. అక్కడి మణికంఠేశ్వరి నగర్ (రోడ్ నెం.7, కేఆర్ బిల్డింగ్ రోడ్డు)లో నిర్మిస్తున్న తన నూతన ఇంటి ఇంటీరియర్ పనుల కోసం హైదరాబాద్కు చెందిన ‘సంయుక్త ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్స్’ ప్రతినిధి సంయుక్త ప్రియాంకతో జూలై 6న రూ.16 లక్షలకు వ్రాతపూర్వక ఒప్పందం చేసుకున్నారు.
రెండు నెలల్లోగా పనులు పూర్తి చేయాలనే షరతుతో ఇప్పటివరకు రూ.9 లక్షలు చెల్లించారు. అయితే, కేవలం రూ.4 నుంచి 5 లక్షల విలువైన పనులు మాత్రమే చేసి, గడువు ముగిసినా మిగిలిన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని బాధితుడు ఆరోపించారు. అంతేకాకుండా పనులు పూర్తి చేయకుండానే మరో రూ.3 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ, కాలయాపనతో తనను ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. తనను మోసం చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న సంయుక్త ప్రియాంకపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ శ్రీకాంత్ కరీంనగర్ రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు అందజేశారు.

