కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. హెచ్చరించినా తీరు మార్చుకోకుండా సమయపాలనకు తూట్లు పొడిచిన మధిర ఏరియా ఆసుపత్రికి (Madhira Govt Hospital) చెందిన నలుగురు స్పెషలిస్ట్ వైద్యులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ (డీసీహెచ్ఎస్) డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 19న మధిర ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో వైద్యులు, సిబ్బంది అందరూ విధిగా సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డాక్టర్ రాజశేఖర్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వైద్యుల తీరులో మార్పు రాలేదు. నవంబర్ 20న నిర్దేశిత సమయానికి నలుగురు వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రి కార్యకలాపాలకు, రోగులకు అందాల్సిన వైద్య సేవలకు ఆటంకం కలిగింది. దీనిని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.
మధిర ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలు-1991 లోని రూల్ 8(1)(ఎ) కింద నలుగురు వైద్యులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ కె. అనిల్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (పిడియాట్రిక్స్) డాక్టర్ డి. శ్రీను, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (ఆర్థోపెడిక్స్) డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (రేడియాలజీ) డాక్టర్ పి. శ్రీకాంత్ ఉన్నారు.
ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న అధికారిక రికార్డులు, ఫైళ్లు, పరికరాలను వెంటనే మెడికల్ సూపరింటెండెంట్ సూచించిన అధికారికి అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని, వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

