యాదాద్రిలో హిట్‌ అండ్‌ రన్‌ కలకలం.. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి!

కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాద (Hit and Run Accidents) ఘటన విషాదాన్ని నింపింది. స్వామివారి పాదాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆయన, రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యాదగిరిగుట్ట పట్టణ సీఐ బి. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 65 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి ఈ నెల 18వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పాదాల సమీపంలో వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది.

అదే మార్గంలో విధులు ముగించుకుని వెళ్తున్న యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుళ్లు సంజయ్, లక్ష్మణ్‌లు రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వృద్ధుడిని గుర్తించారు. వెంటనే స్పందించిన కానిస్టేబుళ్లు 108 అంబులెన్స్‌ సహాయంతో బాధితుడిని భువనగిరి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అనంతరం పోలీస్‌ కానిస్టేబుల్‌ నవీన్‌ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే, రెండు రోజుల పాటు చికిత్స పొందిన వృద్ధుడు నవంబర్ 20వ తేదీ ఉదయం 11:26 గంటలకు మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.

మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది..

మృతుడి పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన వాహనం ఏదనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>