యాదాద్రిలో ధర్మకర్తల కీలక భేటీ.. ఆలయ భవిష్యత్తుపై చర్చల వేడి!

కలం, యాదగిరిగుట్ట : తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో (Yadadri Lakshmi Narasimha Temple) పాలనాపరమైన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ధర్మకర్తల మండలి నాల్గవ సమావేశం శుక్రవారం చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కోటి పుష్పార్చన మహోత్సవ వైభవం కొనసాగుతున్న వేళ జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కోటి పుష్పార్చనలో పాలకమండలి ప్రత్యేక పూజలు

సమావేశానికి ముందు చైర్మన్‌తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు స్వామివారిని దర్శించుకుని సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్పార్చన మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థానం సమావేశ మందిరంలో వేద మంత్రోచ్ఛారణ, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ నాల్గవ సమావేశం ప్రారంభమైంది.

పదవీ విరమణ వేళ.. సేవలకు ఘన గుర్తింపు..

ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎక్స్‌-అఫీషియో సభ్యుడు కాండూరి వెంకటాచార్యుల సన్మానం. ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో దేవస్థానానికి, ధార్మిక కార్యక్రమాలకు అందించిన సేవలను గుర్తిస్తూ ధర్మకర్తల మండలి ఘనంగా సత్కరించింది. ఆయన సేవలను సభ్యులు కొనియాడారు.

యాదాద్రి అభివృద్ధిపై అందరి దృష్టి..

తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ధర్మకర్తల మండలి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈ సమావేశంలో చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి, ఈఓ భవాని శంకర్, సభ్యులు విజేందర్ గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, చిల్లప్ప రాజం విజయశీలం, గుండా మల్లయ్య, కే. లక్ష్మీనారాయణ, ఎక్స్‌-అఫీషియో సభ్యుడు కాండూరి వెంకటాచార్యులు పాల్గొన్నారు. యాదాద్రి అభివృద్ధికి పాలకమండలి తీసుకోబోయే నిర్ణయాలు, భక్తులకు కల్పించనున్న మరిన్ని సౌకర్యాలపై ఇప్పుడు భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>