కలం, వెబ్ డెస్క్: ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ పై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతూ అక్రమాలను అరికట్టనెందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీజీ సేఫ్ (TG SAFE) దాడులను వేగవంతం చేసింది. ఇటీవల కాలంలో ఆహార ప్రమాణాలపై హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ లలో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా మెడికల్ షాపులపై విస్తృత దాడులు చేపట్టారు. హైదరాబాద్14 ప్రాంతాల్లోని మెడికల్ షాపులపై TG SAFE, ఎక్సైజ్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మత్తు మందుల అక్రమ విక్రయాలు,దారి మల్లింపు చర్యలనుఅరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది.
యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా విక్రయించడాన్ని అరికట్టడమే లక్ష్యంగా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నగరంలోని కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి సుమారు 90 షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. రూల్స్ ఉల్లంఘించిన వారికి షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

