కొండగట్టు ఆంజనేయుడి సన్నిధిలో స్పీకర్ ప్రత్యేక పూజలు

కలం, కరీంనగర్ బ్యూరో : ఎల్‌ నినో ప్రభావంతో ఎదురయ్యే కరువును సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రసాదించాలని కొండగట్టు (Kondagattu Temple) ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్ నర్సింగరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి స్పీకర్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు స్పీకర్‌తో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచానికి సవాలుగా మారిన ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రజా ప్రభుత్వానికి అందించాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. 60 ఏళ్లకు ఒకసారి జరిగే చందనోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న ముఖ్యమంత్రికి ఆంజనేయ స్వామి కొండంత ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేస్తున్న సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కొండగట్టు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు సాధిస్తామని స్పీకర్ వెల్లడించారు.

నిజరూప దర్శనం అదృష్టం: మంత్రి లక్ష్మణ్ కుమార్

కొండగట్టులో స్వయంభువుగా వెలసిన ఆంజనేయ స్వామి చందనోత్సవంలో పాల్గొని, స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం గత జన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఆలయాల విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ గడ్డం ప్రసాద్ సహకారంతో కొండగట్టు ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని మంత్రి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>