కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పార్లమెంట్ మార్చ్ (Parliament March) లో పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యార్థి, యువత భవిష్యత్తుకై ఉద్యమించాలని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన పార్లమెంట్ మార్చ్ (ఛలో ఢిల్లీ ) కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితిల ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నునావత్ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కులు కాపాడటం, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఈ పార్లమెంట్ మార్చ్ ద్వారా డిమాండ్ చేయనున్నట్లు వారు తెలిపారు.
భగత్‌సింగ్, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా నూతన భారత నిర్మాణం కోసం యువతరం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా భగత్‌సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ (బనేగా)ను చట్టంగా తీసుకురావాలని కోరారు. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, నూతన జాతీయ విద్యావిధానాన్ని – 2020ను ఉపసంహరించి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని, అందరికీ ఉచితంగా సమాన నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పోలోజు రంజిత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసి బోజుల సంతోష్ చారి, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చెంచల మురళి, కసిరెడ్డి సందీప్ రెడ్డి, సహాయ కార్యదర్శి పెనుమల్ల ఉదయ్ భాస్కర్, నగర సహాయ కార్యదర్శి జువ్వాజీ తిరుపతి, దినేష్, అక్షయ్, హేమంత్, లక్ష్మణ్, అనిల్, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

