పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం దిశానిర్దేశం!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సంపాదించడం వంటి అంశాల్లో విజయం సాధించాలంటే కనీసం ఏడాది పాటు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నగరంలోని మెట్టుగడ్డ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు (National Library Week) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, చెస్, డ్రాయింగ్ తదితర పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా నిరంతరం శ్రమించాలని అన్నారు. విద్యార్థులు పదో తరగతిలో మంచి మార్కులు సాధించి, ఇంటర్మీడియట్‌లో మంచి కళాశాలల్లో చేరడంతోపాటు, భవిష్యత్తులో ఆసక్తి ఉన్న ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు.

ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, ఆలోచనా పరిధి విస్తరిస్తాయని, గ్రంథాలయాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తూ, వారి ప్రతిభను వెలికితీసేందుకు గ్రంథాలయ వారోత్సవాలు (National Library Week) దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ, గ్రంథాలయ శాఖ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు గోవింద్ యాదవ్, కార్పొరేటర్లు తిరుమల వెంకటేష్, మేఘ్యానాయక్, రమేష్ రెడ్డి గ్రంధాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read : దమ్ముంటే నా మీద పోటీ చేయాలి.. సీఎంకు హరీశ్ రావు సవాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>