కలం, వెబ్ డెస్క్: సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ (Anantha Sriram) కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆయన తల్లి ఉమారాణి గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తన తల్లి ఉమారాణికి అవకాశం కల్పించాలని అనంత శ్రీరామ్ జనసేన పార్టీ నాయకులకు కోరినట్లు సమాచారం.
ఈ మేరకు జనసేన నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఉమారాణిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు ఉమారాణి, వీరవేంకట సత్యనారాయణ మూర్తి ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనే అంశం తెరపైకి వచ్చింది.

