కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్లో నకిలీ నోట్లు (Fake Currency) కలకలం రేపుతున్నాయి. గంజ్ కూరగాయల మార్కెట్ (Nizamabad Gunj Market) ప్రాంతంలో నకిలీ రూ.50 నోట్ల చలామణి వెలుగులోకి వచ్చింది. అమాయకులైన వృద్ధ కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ నోట్లను అంటగట్టి మోసం చేశారు. గంజ్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వృద్ధ వ్యాపారుల వద్దకు వచ్చిన కొందరు కేటుగాళ్లు, కూరగాయలు కొనుగోలు చేసినట్లు నటించి నకిలీ రూ.50 నోట్లను చేతిలో పెట్టి అక్కడి నుంచి ఉడాయించారు. వ్యాపారులు ఆ నోట్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇలా సుమారు 10 నుంచి 15 వరకు అనుమానాస్పద రూ.50 నోట్లు బయటపడగా, వాటన్నింటిపై ఒకే సీరియల్ నంబర్ ముద్రించి ఉండటం గమనార్హం.
స్థానిక మార్కెట్లో నకిలీ నోట్లు చలామణి అవుతుండటంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన మోసంపై బాధిత వృద్ధ వ్యాపారులు కన్నీటిపర్యంతమవుతున్నారు. రోజంతా కష్టపడి కూరగాయలు అమ్మితే వచ్చేది కేవలం రూ.300 నుంచి రూ.500 మాత్రమేనని, అలాంటిది తమ కష్టార్జితంలో ఒక్క రూ.50 నోటు నకిలీది వచ్చినా అది తమకు పెద్ద ఆర్థిక నష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వీధి వ్యాపారుల పొట్టకొడుతున్న ఈ నకిలీ నోట్ల ముఠాపై పోలీసులు తక్షణమే దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. మార్కెట్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, తమలాంటి పేద వ్యాపారులకు రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

