ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలి: రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Rajarshi Shah) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి సూచికల్లో జిల్లా ర్యాంకును ప్రతి వారం మెరుగుపరిచేలా పీహెచ్‌సీ, ప్రోగ్రాం వారీగా ప్రగతి సాధించాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సుమారు 60 శాతంగా ఉన్నాయని, వీటిని మరింత పెంచాలని స్పష్టం చేశారు.

గర్భిణుల నమోదు మొదటి త్రైమాసికంలోనే జరిగేలా చూడాలని, రెండో, మూడో త్రైమాసికాల్లో నమోదు కావడానికి గల కారణాలను నెలవారీగా విశ్లేషించాలని కలెక్టర్ ఆదేశించారు  హైరిస్క్‌ గర్భిణులను సకాలంలో గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్‌సీఎం ఇంజక్షన్లు ఇవ్వడం కొనసాగించాలని, 180 ఐఎఫ్‌ఏ మాత్రల పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

గర్భిణులపై ప్రత్యేక దృష్టి..

మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను కేవలం వర్షాకాలంలోనే కాకుండా ఏడాది పొడవునా ముందస్తుగా బర్త్‌ వెయిటింగ్‌ రూమ్‌లకు తరలించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యే శిశువుల శాతాన్ని కనీసం 90 శాతానికి పెంచాలని ఆదేశించారు. రిమ్స్‌ క్రిటికల్‌ కేర్‌ విభాగంలోనూ గేట్‌పాస్‌ విధానం అమలు చేసి, రోగుల సహాయకుల కోసం వెయిటింగ్‌ ఏరియాలో కుర్చీలు, ఫ్యాన్లు, మైక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వ్యాధి నిరోధక టీకాల వివరాలను ఎప్పటికప్పుడు ‘యూ-విన్‌’ పోర్టల్‌లో వంద శాతం నమోదు చేయాలన్నారు. ఆర్బీఎస్కే బృందాలు పాఠశాలల్లో నిర్వహించే పరీక్షల్లో వ్యాధులు గుర్తించిన పిల్లల వివరాలను హెల్త్‌కార్డుల్లో నమోదు చేసి, రిమ్స్‌కు రిఫర్‌ చేసిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం ఫాలోఅప్‌ చేయాలని స్పష్టం చేశారు.

ఎన్సీడీ స్క్రీనింగ్‌ తప్పనిసరి..

30 ఏళ్లు దాటిన వారందరికీ ఎన్సీడీ స్క్రీనింగ్‌ వంద శాతం పూర్తి చేసి, చికిత్స పొందుతున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పీవీటీజీ గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా 13 పీఎం జన్‌మన్‌ వాహనాలను సమర్థంగా వినియోగించుకోవాలని, వైద్యాధికారులు స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్లి గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు.

అలాగే టీబీ, లెప్రసీ, ఎయిడ్స్‌, పీసీపీఎన్‌డీటీ తదితర కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీఎంహెచ్‌ఓ సాధన, రిమ్స్‌ పర్యవేక్షకులు వెంకట్‌, బోథ్‌, ఉట్నూర్‌, నార్నూర్‌ సీహెచ్‌సీల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం అధికారులు, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>