కలం, వెబ్ డెస్క్: హరీశ్ రావు బీజేపీతో రహస్య మంతనాలు చేస్తున్నారని, నిజం కాదని సిద్దిపేట ఎల్లమ్మ మీద ఒట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండరని.. కేసీఆర్‌కు హరీశ్ రావు వెన్నుపోటు పొడుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అలా జరగాల్సిందేనని వ్యాఖ్యానించారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు. వీలైతే మంచి ఆలోచనలు ఇవ్వాలని.. అంతే తప్ప తమను ఏమైనా అంటే ఊరుకోబోమన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ ప్రభుత్వాలు తెచ్చిన మంచి పథకాలను తాను రద్దు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
సిద్దిపేటలో రూ.177 కోట్లతో రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ వివరించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనని కేటీఆర్ తన చెల్లె కవితను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. చెల్లెకు న్యాయం చేయలేనివాడు, రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎలా మోసం చేస్తారో సీఎం రేవంత్ దెయ్యం కథ చెప్పి ఆకట్టుకున్నారు.

