విజయమ్మ బహిరంగ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) కుమార్తె అంజలి రెడ్డి పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెళ్లి కోసం ష‌ర్మిల బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌ను వేదిక‌గా నిర్ణ‌యించ‌డం, త‌ర్వాత జ‌గ‌న్ దీనికి నిరాక‌రించ‌డం అంద‌రికీ తెలిసిందే. ఈ ఇల్లు నాదంటే నాద‌ని అన్నాచెళ్లెళ్ల మ‌ధ్య చిన్న‌పాటి యుద్ధ‌మే న‌డిచింది. చివ‌రికి ష‌ర్మిల త‌న కుమార్తె వివాహ వేదిక‌ను మ‌రో చోటుకు మార్చుకున్నారు. ష‌ర్మిల అతిథుల‌ను పెళ్లికి ఆహ్వానిస్తున్న క్ర‌మంలో మ‌రోసారి వివాదం చెల‌రేగింది. గ‌త నెల నుంచి అంద‌రికీ ఇన్విటేష‌న్ కార్డులు ఇస్తున్న‌ ష‌ర్మిల ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. త‌న కుమార్తె పెళ్లికి రావాల‌ని ఆహ్వానించారు. ఈ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక్క‌డే వివాదం మొద‌లైంది.

చంద్ర‌బాబుతోనే మొద‌లైన వివాదం..

ష‌ర్మిల సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫోటో ఆధారంగా జ‌గ‌న్ అనుకూల మీడియాలో ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. ష‌ర్మిల, చంద్ర‌బాబు గురించి ఉన్న క‌థ‌నం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ష‌ర్మిల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ వైసీపీ, వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న అనుకూల మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళ అని కూడా చూడ‌కుండా సొంత చెల్లిపై దుర్మార్గ‌పు రాత‌లు రాయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్‌, లేదా స‌ద‌రు మీడియా సంస్థ త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక ఈ వ్య‌వ‌హారంపై వైఎస్ విజ‌య‌మ్మ స్పందించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్తా క‌థ‌నం నేప‌థ్యంలో ష‌ర్మిల‌కు అండ‌గా నిలుస్తూ విజ‌య‌మ్మ పేరుతో ఓ లేఖ వైర‌ల్ అయ్యింది.

లేఖ‌లో ఏముందంటే..

విజ‌య‌మ్మ పేరుతో స‌ర్క్యూలేట్ అవుతున్న స‌ద‌రు లేఖ‌లో ష‌ర్మిల‌పై దుష్ప్ర‌చారాన్ని ఖండించారు. త‌న బిడ్డ‌కు జ‌రిగిన అన్యాయం, త‌న‌పై జ‌రుగుతున్న దుష్ప్రచారం చూస్తుంటే చాలా బాధేస్తుంద‌ని పేర్కొన్నారు. వైఎస్ఆర్‌కు బంధాల విలువ బాగు తెలుసున‌ని వ్యాఖ్యానించారు. సీఎం చంద్ర‌బాబుతో వైఎస్ఆర్‌కు రాజ‌కీయ విబేధాలు ఉండేవ‌ని పేర్కొన్నారు. కానీ, అవి కూడా 50 ఏళ్ల క్రితం వ‌ర‌కే ఉండేవ‌న్నారు. వారిద్ద‌రూ ఎంతో స్నేహ‌పూర్వ‌కంగా ఉండేవార‌ని చెప్పారు. తండ్రి వ‌య‌సున్న చంద్ర‌బాబుకు ష‌ర్మిల శుభ‌లేఖ అందిస్తే త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. సొంత వాళ్ల‌పై త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌డం చూస్తుంటే మ‌న‌సుకు బాధ‌గా ఉంద‌న్నారు. రాజ‌కీయంగా ఎదుర్కోలేక ష‌ర్మిల‌పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని పేర్కొన్నారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ష‌ర్మిల న‌వ్వుతూ ఎదుర్కొంటుంద‌న్నారు. ఆమెపై ఎంత దుష్ప్ర‌చారం చేసినా వెన‌క్కి త‌గ్గ‌ద‌న్నారు. రాజ‌కీయంగా ఎన్ని ఉన్నా కుటుంబ బంధాలు, మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వం దిగ‌జార్చే స్థాయికి దిగ‌జార్చొద్ద‌ని పేర్కొన్నారు. త‌న బిడ్డ చేసిన త్యాగాన్ని, ప‌డిన క‌ష్టాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోవ‌ద్ద‌ని, వైఎస్ఆర్ ఆశ‌యాలు, విలువ‌లు, మాన‌వ‌త్వం గురించి మాట్లాడే వాళ్లు ఇప్పుడు ష‌ర్మిల పై జ‌రుగుతున్న దాడిని గ‌మ‌నించాల‌ని కోరారు.

ఈ లేఖ వైఎస్ విజ‌య‌మ్మ పేరుతో వైర‌ల్ అవుతున్నా ఆమె రాశార‌ని అధికారికంగా ఎక్క‌డా లేదు. మ‌రి ఈ లేఖ ఎవ‌రు రాశారు? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ష‌ర్మిల కానీ, విజ‌య‌మ్మ కానీ స్పందిస్తారా అనేది వేచి చూడాలి. ఇక డిసెంబ‌ర్ 5న అంజ‌లిరెడ్డి పెళ్లి జ‌రుగ‌నుంది. ఈ పెళ్లికి మ‌రో వేడుక నిర్ణ‌యించామ‌ని ష‌ర్మిల చెప్పారు. కానీ, అధికారికంగా ఎక్క‌డ అనేది మాత్రం వెల్ల‌డించ‌లేదు. మ‌రికొద్ది రోజుల్లో ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>