కలం, వనపర్తి : కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామంలో అయ్యప్ప నామస్మరణతో పడిపూజ (Ayyappa Padi Pooja) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన అయ్యగారి రఘునాథ్ రెడ్డి గురుస్వామి అయ్యప్ప దీక్ష స్వీకరించిన సందర్భంగా బుధవారం రాత్రి గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్ర ఆలయ నిర్మాణానికి అయ్యగారి యాదమ్మ–రాంరెడ్డి దంపతుల మనుమడు, అయ్యగారి సుస్మిత–రఘునాథ్ రెడ్డి దంపతులు రూ.2,51,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులకు అందించారు. దాతలను సమితి సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూదిరెడ్డి శోభారాణి–శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పీజే బాబు, అయ్యప్ప సేవా సమితి గురుస్వాములు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సీనియర్ గురుస్వాములను సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సేవా సమితి భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

