కలం, వెబ్ డెస్క్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన మహేష్ గౌడ్.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడులో జరిగిన పలు కార్యక్రమాల్లో బహిరంగంగానే ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కొడంగల్ నియోజకవర్గానికి వేల కోట్లు మంజూరు చేస్తున్నారని.. మునుగోడుకు మాత్రం రూ.500 కోట్లు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై మాట్లాడితే తొక్కుతానంటూ సీఎం మాట్లాడుతున్నారని ఆరోపించారు.
అయితే, తాను తొక్కించుకునే రకం కాదని.. అధికారం ఉంటే ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదన్నారు. “బిడ్డా రేవంత్.. ఖబడ్దార్.. ఇలానే ఉంటే యుద్ధం మొదలవుతుంది” అని రాజ్ గోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు రోజు ప్రభుత్వాలు కేవలం కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ (TPCC Chief Mahesh Kumar Goud).. వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యల అంశాన్ని టీపీసీసీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ ఎలా స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికంగా మారింది.

