కలం, సోన్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా(Indiramma Life Insurance) పథకం నమోదు ప్రక్రియను గురువారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో సర్పంచ్ గుర్రం రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.
ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి కుటుంబ పెద్దకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఈ బీమా పథకం అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్, వార్డు సభ్యులు మద్దెల ప్రసాద్, గుర్రం భీమన్న, మాజీ వార్డు సభ్యుడు సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

