కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ స్కీమ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సిద్దిపేట వేదికగా గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ స్కీమ్‌లో లబ్ధిదారులుగా చేరే కుటుంబాల నమోదు ప్రక్రియకు అవసరమైన దరఖాస్తును ఈ వేదికగా విడుదల చేయనున్నారు. ఒకవైపు మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో లబ్ధిదారులుగా చేరేందుకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు గ్రామాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను నిర్వహించి చేర్చే ప్రక్రియనూ ఏకకాలంలో ప్రభుత్వం చేపట్టనున్నది.
రాష్ట్రం మొత్తం మీద కోటి కుటుంబాలకు ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మంగళవారం రివ్యూ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఈ స్కీమ్‌తో పాటే ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీని కూడా మొదలుపెట్టనున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించినా దీన్ని ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మొదలుపెట్టనున్నది. అదే రోజున ‘చేయూత’ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి కొత్త లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ (నమూనా) ప్రారంభమవుతుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సాయం జమ అవుతుంది.
కేసీఆర్, హరీశ్‌రావుపై విమర్శలపైనే ఆసక్తి
సిరిసిల్లలో బహిరంగసభ సందర్భంగా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ తన ప్రసంగంలో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. కేటీఆర్‌కు హైదరాబాద్‌లో ‘సర్వీస్ అపార్ట్మెంట్లు’ ఉన్నాయని, 3 హోటళ్లు ఉన్నాయని, పదేండ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బినామీల పేర్లతో భూముల్ని పొందారని.. ఇలాంటి కామెంట్లు చేశారు.
ఇప్పుడు సిద్దిపేట వేదికగా స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఈ జిల్లాలోని గజ్వేల్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్‌ను ఉద్దేశించి పలు సంచలన కామెంట్లు చేసే అవకాశమున్నది. ఫోన్ ట్యాపింగ్, మల్లన్నసాగర్ సమీపంలో భూముల కొనుగోళ్లు, ఫామ్ హౌజ్ నిర్మాణం, మామ హన్మంతరావు పేరు మీద భూముల రిజిస్ట్రేషన్లు, కొండపోచమ్మ సాగర్ నుంచి పాండురంగ (పంచపాండవుల) చెరువు మీదుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం, సర్వే నంబర్ 325లో 45 ఎకరాల భూముల మాయం.. ఇలాంటి అంశాలను ప్రస్తావించి ఒకేసారి కేసీఆర్, హరీశ్‌రావును టార్గెట్ చేసే అవకాశమున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
భారీ జన సమీకరణపై ఫోకస్
సిద్దిపేటలో సీఎం రేవంత్ పర్యటనను పురస్కరించుకుని భారీ స్థాయిలో జన సమీకరణపై కాంగ్రెస్ శ్రేణులు ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ కంచుకోటగా పేరున్న సిద్దిపేటలో భారీ సభ ద్వారా ఆ పార్టీకి గండికొట్టామనే మెసేజ్‌ను జనంలోకి పంపాలని హస్తం నేతల భావన. నాలుగు రోజులుగా సభ ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
బహిరంగసభ వేదికపై డిజిటల్ స్క్రీన్ల ద్వారా మూడేండ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రదర్శన ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.
26న ఇందిరమ్మ చీరల పంపిణీ
సిద్దిపేట వేదికగానే ‘ఇందిరమ్మ చీరల’ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ శ్రీకారం చుట్టాలని భావించినా కొన్ని అనివార్య కారణాలతో అది ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. కోటిమంది మహిళలకు చీరల పంపిణీ జరగనున్నది. ‘రాజ్యాంగ దినోత్సవం’ ప్రాధాన్యతను గుర్తించి ఆ రోజున ఈ స్కీమ్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా 4,64,587 మంది కొత్త లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్లను అందజేయనున్నది. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా నమూనా చెక్కులను పంపిణీ చేసి ఆ రోజునే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ‘చేయూత’ పెన్షన్‌ను జమ చేయనున్నది.
సీఎం చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సిద్దిపేట పర్యటన సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం జిల్లాలో రూ.544 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేసి సుమారు రూ.93 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో కొన్ని..
– సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన.
– జిల్లాలోని 7 ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు క్లాస్ రూమ్స్ (రూ.15.45 కోట్లు)కు శంకుస్థాపన.
– దౌల్తాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (రూ.7.80 కోట్లు) శంకుస్థాపన.
– చిన్నకోడూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (రూ.7.50 కోట్లు)కు పునాది రాయి.
– 6 తహసీల్దార్ కార్యాలయాల భవనాలకు (రూ.13.50 కోట్లు) శంకుస్థాపన.
– రూ.54.70 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవం.
– గజ్వేల్‌లో రూ.1.60 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయానికి ప్రారంభోత్సవం.
– జిల్లాలో రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలకు ఓపెనింగ్.
– రాయపోలు మండలంలో రూ.3.88 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం ప్రారంభోత్సవం.
– జనగామ నియోజకవర్గంలో రూ.6.90 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న 3 విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన.
– కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రానికి, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం.

