కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో పోలీసు అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB Raids) చిక్కాడు. హోటల్ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు ప్రతినెలా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన టోలిచౌకి పోలీస్ స్టేషన్ SHO ఎల్.రమేష్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే రూ.20వేలు లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
బాధితులు వివరాల ప్రకారం.. టోలీచౌకిలోని ఓ హోటల్ ను అర్ధరాత్రి 1 గంట తరువాత నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటే ప్రతినెలా రూ.50 వెలు మాముళ్లు ఇవ్వాలని SHO ఎల్.రమేష్ నాయక్ డిమాండ్ చేసినట్లు సమాచారం. తొలుత రూ.30 వేలు తీసుకున్న పోలీసు అధికారి మిగిలిన రూ.20వేలు ఇవ్వాలని బాధితులను ఒత్తిడి చేశారు. దీంతో హోటల్ యజమాని ఏసీబీని ఆశ్రయించారు.
ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు (ACB Raids) పక్కా స్కెచ్ వేసి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా రమేష్ నాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం స్టేషన్ లో తనిఖీలు నిర్వహించగా నాలుగు వేర్వేరు కవర్లలో లెక్కల్లో చూపని రూ.1.85 లక్షల నగదు దొరికింది. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు SHOను అదుపులోకి తీసుకున్నారు.

