కలం, వనపర్తి: వనపర్తి నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) ప్రత్యేక చొరవతో నియోజకవర్గానికి నాలుగు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సింగిల్ విండోలు) ( Single Window Societies ) మంజూరయ్యాయి. రేవల్లి, ఏదుల, సోలిపూర్, వెల్టూరు గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ, కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 11న వ్యవసాయ, సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సింగిల్ విండోల ఏర్పాటుతో ఆయా గ్రామాల రైతులకు పంట రుణాలు, ఎరువులు, నాణ్యమైన విత్తనాలు తదితర సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. నియోజకవర్గంలోని పెద్దగూడెం–కడుకుంట్ల, గుమ్మడం–అయ్యవారిపల్లి గ్రామాలకు కూడా త్వరలో సింగిల్ విండోలు మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్త సంఘాల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

