నకిలీ లోన్ పత్రాలతో టోకరా.. నిందితుడి అరెస్ట్

కలం, కరీంనగర్: రుణాలు ఇప్పిస్తానంటూ ఆన్‌లైన్ వేదికగా ప్రచారం చేసుకుంటూ, లోన్ మంజూరైనట్లు నకిలీ పత్రాలు (Fake Loan Documents) సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వొడ్నాల జగన్ తన కుమార్తె వైష్ణవి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ఇతరుల ద్వారా తన కుమార్తెకు పరిచయమైన సాయికృష్ణ రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆరెపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 232/Aలో ఉన్న 383.02 గజాల ఇంటి స్థలంపై టాటా క్యాపిటల్ ఫైనాన్స్ నుంచి రూ.1.50 కోట్ల రుణం మంజూరు చేయిస్తానని చెప్పాడు.

దీనికోసం మొదటి విడతగా ఇన్సూరెన్స్ పేరుతో రూ.8.99 లక్షలు చెల్లించాలని కోరాడు. దీంతో వైష్ణవి నిందితుడు సాయికృష్ణ ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. అనంతరం లోన్, డాక్యుమెంట్ల ప్రాసెసింగ్ కోసం రెండో విడతగా మరో రూ.3.22 లక్షలు వసూలు చేసుకున్నాడు. ఆ తర్వాత రుణం మంజూరైనట్లు నకిలీ పత్రాలను జగన్‌కు అందజేశాడు. ఆ పత్రాలను తీసుకుని సంబంధిత ఫైనాన్స్ సంస్థకు వెళ్లగా, అవి తమ సంస్థకు చెందినవి కావని సిబ్బంది వెల్లడించారు. పత్రాలపై ఉన్న సంతకాలు కూడా తమ బ్యాంకు అధికారులవి కావని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వేల్పుల సాయికృష్ణను అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన అతను ప్రస్తుతం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో నివసిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు తయారు చేసిన లోన్ మంజూరు నకిలీ పత్రాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టడంతో పాటు మోసానికి సంబంధించిన ఇతర ఆధారాలు సేకరించాల్సి ఉందని, అందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>