రూ.13 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన సర్పంచ్

కలం, ​ఖమ్మం బ్యూరో: ​గ్రానైట్ క్వారీల నిర్వహణ సజావుగా సాగేందుకు, ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తానంటూ భారీగా లంచం డిమాండ్ చేసిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన సర్పంచ్ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ మొత్తంలో మొదటి విడతగా రూ.2 లక్షలు నగదు తీసుకుంటుండగా అధికారులు ఈ దాడి నిర్వహించారు.

​ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగడ్డ తండా సర్పంచ్ ధరావత్ వీరు (Dharavath Veeru), ఖమ్మంలోని శరదా స్టోన్స్, ప్రీమియర్ గ్రానైట్స్, రాశి గ్రానైట్స్ సంస్థలకు చెందిన క్వారీల కార్యకలాపాలు నిరాటంకంగా సాగేందుకు అనుకూలంగా వ్యవహరిస్తానని చెప్పి లంచం డిమాండ్ చేశాడు. తొలుత రూ.30 లక్షలు అడిగిన ఆయన, ఆ తర్వాత ఆ డిమాండ్‌ను రూ.13 లక్షలకు తగ్గించాడు. ​

ఇందులో భాగంగా తొలి విడత సొమ్ము రూ.2 లక్షలు తీసుకునేందుకు అంగీకరించి, ఖమ్మంలోని ఫిర్యాదుదారుడి కార్యాలయంలో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ బృందం దాడి చేసి వీరును పట్టుకుంది. ఇందులో భాగంగా లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి, విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన నిందితుడు ధరావత్ వీరును అరెస్ట్ చేసినట్లు, వరంగల్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>