ఉద్యాన పంటలతో గిరిజన రైతులకు స్థిర ఆదాయం: ఐటీడీఏ పీఓ

కలం, ఆదిలాబాద్ : గిరిజన రైతులు ఉద్యాన పంటల సాగు చేపట్టి ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు (Utnoor ITDA) అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఉద్యాన శాఖ నర్సరీని సందర్శించిన ఆయన షేడ్ నెట్, నెట్‌హౌస్‌లలో సాగు చేస్తున్న మునగ, వెదురు, కరోండా, డ్రాగన్ ఫ్రూట్ తదితర మొక్కలను పరిశీలించారు. ఐటీడీఏ, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన శాఖల సమన్వయంతో గిరిజన రైతులకు షేడ్ నెట్‌లు అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా ఉద్యానవన అధికారి గుడిమల్ల సందీప్ కుమార్‌కు సూచించారు. మామిడి తోటలో అంతర పంటగా సాగు చేస్తున్న టమాటా పంటను పరిశీలించి, అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే ఆయిల్ పామ్, కూరగాయలు, మల్బరీ తదితర పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గిరిజన రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ అందిస్తూ, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారిణి అలేఖ్య, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>