కలం, కరీంనగర్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని మానకొండూర్ ఎమ్మెల్యే టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Shankarapatnam PHC) బుధవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రతను గమనించిన ఆయన బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోనే పరిశుభ్రత పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. శుచి, శుభ్రత పాటించడం ద్వారా సగం రోగాలను దూరం చేసుకోవచ్చని, ఆసుపత్రి లోపలే కాకుండా పరిసరాల పరిశుభ్రతపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు వివరాలు, విధులకు హాజరయ్యే సమయాలు, రోజువారీ విధులు, ప్రతిరోజూ ఎంతమంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు, ఏయే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులను కూడా ఎమ్మెల్యే పలకరించి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో పీసీసీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

