కలం, నేరడిగొండ: గ్రామాల సమగ్ర అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునాది వేశారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. నేరడిగొండ మండలం బంధం రేగడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
గ్రామ పంచాయతీ భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు కీలక వేదికగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని గుర్తుచేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, అంతర్గత రహదారులు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

