కలం, వరంగల్: వరంగల్ (Warangal) నగరంలో దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నియంత్రణకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా నాలాలు, మురుగునీటి ప్రవాహ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా (Drone Mosquito Control) క్రిమిసంహారక మందుల పిచికారీ కార్యక్రమానికి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న బుధవారం నయీంనగర్‌లోని రాజాజీ నాలా వద్ద శ్రీకారం చుట్టారు.
సాధారణంగా పారిశుద్ధ్య సిబ్బంది చేరుకోలేని లోతైన నాలాలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా సులభంగా మందులు పిచికారీ చేయవచ్చని కమిషనర్ తెలిపారు. తక్కువ సమయంలో విస్తృత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేపట్టడం ద్వారా దోమల ఉత్పత్తి కేంద్రాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చన్నారు.
నగరంలోని 66 డివిజన్లలో దశలవారీగా ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని, వ్యాధుల వ్యాప్తికి ముందే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ కార్యక్రమాలను సమన్వయంతో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, అర్బన్ మలేరియా అధికారి రజిని, సూపర్‌వైజర్ అనిల్, హెల్త్ అసిస్టెంట్లు, మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

