కలం, వెబ్ డెస్క్ : చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై ఒక్కసారిగా సీఎన్జీ గ్యాస్ లీకవడంతో (CNG Gas Leak) కలకలం రేగింది. పూవిరుందవల్లి సమీపంలోని కూడపాక్కం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు వెయ్యి కిలోల సీఎన్జీ గ్యాస్ లోడుతో టోరెంట్ గ్యాస్ గిడ్డంగి నుంచి మధురవాయల్‌కు వెళ్తున్న ఒక వాహనంలో మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సిలిండర్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా భారీ శబ్దంతో బయటకు లీకైంది. ఆ శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
లీకైన గ్యాస్ రోడ్డుపై తెల్లటి పొగమంచులా దట్టంగా వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణమైనా పెను ప్రమాదం సంభవించవచ్చన్న ఆందోళనతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో రహదారిపై ఉద్రిక్తత నెలకొనడంతో పాటు వాహనాల రాకపోకలు కొద్దిసేపు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన వాహన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, వెంటనే సిలిండర్ వాల్వులను మూసివేశాడు. డ్రైవర్ సమయస్ఫూర్తితో గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడంతో పెను ముప్పు తప్పింది.

