కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో పైసలిస్తేనే పనులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేగా చెప్పినా పనులు జరగడంలేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్ల (Jadcherla) తహసిల్దార్ కార్యాలయంలో భూమి విరాసత్ కోసం నేను రికమెండ్ చేస్తే.. పని కాలేదు కానీ అదే కార్యాలయంలో 15 వేల రూపాయలు లంచం ఇస్తే రిజిస్ట్రేషన్ అయిందన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతిరోజు లక్షల రూపాయల వరకు అవినీతి సొమ్ము అడ్డంగా కలెక్షన్లు చేస్తున్నారని ఆరోపించారు.
వీటన్నింటిని గురించి పత్రికా మిత్రులు రాయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొరారు. ఈ మేరకు మంగళవారం జడ్చర్లలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఎవరు కరెక్ట్ కాదని,అధికారులే కరెక్ట్ అని అనిరుద్ రెడ్డి సెటైరికల్ పంచులు వేశారు. ఇష్టం వచ్చినట్లుగా లంచలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతిరోజు అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ గ్రామంలో చేసిన సీసీ రోడ్ పనులకుగాను రూ. 5 లక్షల బిల్లుకు 20 నుంచి 30 శాతం కమిషన్ సంబంధిత అధికారులు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేసిన తప్పుల మూలంగానే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అందుకే పత్రికా విలేకరులు అవినీతి, అక్రమాలను ధైర్యంగా వెలికితీయాలన్నారు. సమాజానికి ఉపయోగపడే పనులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానన్నారు.

