కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా (Khelo India) యూత్ గేమ్స్–2026లో భాగంగా కరీంనగర్లో జరగనున్న జూడో పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయి పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఏర్పాట్లలో చిన్నపాటి లోటుపాట్లకు కూడా తావివ్వకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అధికారిక లోగో, మస్కట్‌ను ఆవిష్కరించారు. ఈ అధికారిక లోగో, మస్కట్‌ను ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో ఆవిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశించింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోనూ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.
ఏడు రోజుల పాటు 386 మందికి ఏర్పాట్లు
డిసెంబర్ 15న క్రీడాకారులు కరీంనగర్‌కు చేరుకోనున్నారని, డిసెంబర్ 17 నుంచి 19 వరకు కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జూడో పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 15 నుంచి 21 వరకు ఏడు రోజుల పాటు ప్రతిరోజూ 386 మంది బృంద సభ్యులు కరీంనగర్లో ఉండనున్నారని పేర్కొన్నారు. ఇందులో 256 మంది అథ్లెటిక్స్ (క్రీడాకారులు) 77 మంది సహాయక సిబ్బంది, 30 మంది సాంకేతిక అధికారులు, ఒక పోటీల నిర్వహణ మేనేజర్, 10 మంది వీఐపీలు, 12 మంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు ఉంటారని వివరించారు. వీరితో పాటు పోటీలు జరిగే రోజుల్లో మరో 10 మంది ప్రత్యేక స్వచ్ఛంద సేవకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే బృందాలకు అవసరమైన వసతి, భోజనం, రవాణా, వైద్య సేవలు తదితర సౌకర్యాలు ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశానికి ఆదర్శంగా కరీంనగర్ నిలవాలి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశస్థాయిలో ఆదర్శంగా నిలిచేలా అధికారులు చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. క్రీడా వేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోటీలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. అధికారిక లోగో, మస్కట్‌ను ఉపయోగించి పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు, యువత, ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేస్తూ క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ స్వామి, డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఆర్డీఓ జలకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

