కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాల్వ శ్రీరాంపూర్ (Kalva Srirampur) మండల కేంద్రంలో నిర్వహించిన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే (ప్రభుత్వ విప్) విజయ రమణారావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వర్గీయుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు రసాభాసకు దారితీసింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ సకాలంలో హాజరయ్యారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ముఖ్య నేతలు రెండున్నర గంటలు గడిచినా కార్యక్రమానికి చేరుకోలేదని సమాచారం. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, తనకు ఇతర కార్యక్రమాలు ఉండటంతో ఎంపీ వంశీకృష్ణ వేదికపై ప్రసంగించి అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
ఎంపీ ప్రసంగం ముగించుకుని వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు ఆయనను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. “స్థానిక ఎమ్మెల్యే రాకుండానే వేదికపై ఎలా మాట్లాడతారు?” అంటూ ఎంపీని ప్రశ్నించి నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామంపై ఎంపీ వంశీకృష్ణ స్పందిస్తూ.. తాను ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నానని, సాయంత్రం పూజా సమయానికి చేరుకోవాల్సి ఉండటంతో పాటు ఇతర అధికారిక కార్యక్రమాలు కూడా ఉండటంతో ముందుగానే ప్రసంగించానని వివరణ ఇచ్చారు.
తాను ఎవరితోనూ గొడవ పడే ఉద్దేశంతో రాలేదని, కేవలం సమయాభావం వల్లే ప్రసంగించానని స్పష్టం చేశారు. మరోవైపు, అయ్యప్ప మాలధారణలో ఉన్న ఎంపీని అడ్డుకుని అవమానించడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రభుత్వ కార్యక్రమం రసాభాసగా మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

