చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

కలం, యాదగిరిగుట్ట : చెక్ బౌన్స్ కేసులతో (Cheque Bounce Cases) న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులకు ఊరట కల్పించే దిశగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 21వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల పరిధిలో ప్రత్యేక లోక్ అదాలత్ (Special Lok Adalat) నిర్వహించనుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులను వేగంగా పరిష్కరించడమే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశం. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయస్థానంతో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదాద్రి (Yadadri) కోర్టుల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

988 కేసులు పెండింగ్.. 157 కేసులపై ప్రత్యేక దృష్టి!

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 988 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 157 కేసులను ప్రాథమికంగా పరిష్కారానికి గుర్తించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వెల్లడించింది. ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో ముందుకు వస్తే రాజీ మార్గంలో కేసులకు ముగింపు పలికే అవకాశం ఉంటుంది.

సమయం, ఖర్చు ఆదా.. అప్పీల్‌కు అవకాశం లేని తీర్పు

సాధారణ న్యాయ ప్రక్రియతో పోలిస్తే లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని అధికారులు తెలిపారు. లోక్ అదాలత్‌లో ఇరు పక్షాల అంగీకారంతో వెలువడే అవార్డు అంతిమమైనదని, దానిపై సాధారణ అప్పీల్‌కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ న్యాయవాదులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరస్పర అంగీకారంతో తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎ. జయరాజు, సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>