కలం, జగిత్యాల: హైదరాబాద్లో జరిగిన ‘భారత్ సమ్మిట్’ ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇటలీ ప్రతినిధి ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలను (Filibeck Remarks) భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు తీవ్రంగా ఖండించారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్లో ఉన్న సమితి కార్యాలయంలో నాయకులు అక్కినపల్లి కాశీనాదం, చిట్ల గంగాధర్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
అంతర్జాతీయ వేదికపై విదేశీ ప్రతినిధుల సమక్షంలో ప్రధాని మోదీని విమర్శించడం, దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని ఆరోపించడం దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని ఏసీఎస్ రాజు విమర్శించారు. ప్రపంచ దేశాలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తుంటే, రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. కాన్ఫరెన్స్ వీసాపై భారత్కు వచ్చిన ఇటలీ నేత ఫిలిబెక్ దేశ అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్కు మద్దతుగా నినాదాలు చేయడం వీసా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
విదేశీ ప్రతినిధి మన దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని, సంబంధిత అధికారుల ద్వారా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, నాయకులు సింగం గంగాధర్, వేముల దేవరాజం, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్, ఎడమల వెంకట్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ వీరన్న, బొందుకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

