కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలలు , కళాశాలలు , మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం , సైబర్ నేరాలు , రోడ్డు ప్రమాదాలు , మహిళల భద్రత వంటి సామాజిక సమస్యలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అధికారులకు సూచించారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్ సంకల్ప’ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ప్రతినిధులు , సంబంధిత శాఖల అధికారులతో జిల్లావ్యాప్తంగా చేపట్టాల్సిన అవగాహన కార్యక్రమాలు , భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడాలి
యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని , డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక , మానసిక , సామాజిక దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి విద్యాసంస్థలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాలన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వివిధ రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
జిల్లాలో రోడ్డు ప్రమాదాల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఒక సంవత్సర కాలంలో జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 340 మంది ప్రాణాలు కోల్పోగా , కోవిడ్ సమయంలో ఒక సంవత్సరంలో 200 మంది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 60 శాతం ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లోనే చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ , తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి , గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి , ఎన్ఎస్సీ జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీమతి కవితా రెడ్డి , నిజామాబాద్ , ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్ , ఏసీపీ మస్తాన్ అలీ , ఎన్ఎస్సీ జాయింట్ సెక్రటరీలు సీహెచ్. రజనీకాంత్ , శ్రీమతి కె. సిరీష్ , దుశాంత్ , శ్రీమతి ఉష , శ్రీనివాస్ రెడ్డి , జిల్లా విద్యాశాఖ అధికారి తరఫున శ్రీనివాసరావు , జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి తుకారాం , వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఇతర సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.

