కలం, హనుమకొండ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్ఐఆర్ రోల్ అబ్జర్వర్ హరిచందన (Harichandana) అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ (Hanumakonda) తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాలు, కొత్త దరఖాస్తుల పరిష్కారం, క్షేత్రస్థాయి విచారణలను పరిశీలించారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు కలిగిన వారి పేర్ల తొలగింపులో నిబంధనలు పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ తొలి విడతలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు ఉన్న 1,01,697 మంది పేర్లను ఏఎస్డీడీ జాబితాలో గుర్తించినట్లు తెలిపారు. రెండో విడత నోటీసుల ప్రక్రియలో 970 మందిని అనర్హులుగా గుర్తించామన్నారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేదని, నోటీసుల పరిశీలన కూడా పూర్తయిందని వెల్లడించారు.
రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సమక్షంలో విచారణలు నిర్వహిస్తున్నామని, ప్రతి గురువారం పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి జాబితాల వివరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్డీడీ జాబితాలను ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు జిల్లా వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, ఆర్డీవో వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

