కలం, వరంగల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. మంగళవారం ఎల్బీనగర్‌లోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్నతో కలిసి కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
వరంగల్ తూర్పు (Warangal East) నియోజకవర్గంలో కొత్త పెన్షన్ల కోసం 3,675 దరఖాస్తులు రాగా, 2,740 మందికి మంజూరయ్యాయని తెలిపారు. వీరిలో 733 మంది దివ్యాంగులు, 1,704 మంది వితంతువులు, 166 మంది వివాహిత ఒంటరి మహిళలు, 22 మంది అవివాహిత ఒంటరి మహిళలు, 98 మంది నేత కార్మికులు, 17 మంది తాటి గీత కార్మికులు ఉన్నారు. వీరికి నెలకు రూ.69,89,840 ఆర్థిక సాయం అందనుంది. ఈ నెల 19న పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
నియోజకవర్గంలో ఇప్పటికే 35,716 మంది పెన్షన్లు పొందుతున్నారని, అర్హత ఉండి పెన్షన్ రాని వారి వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని కొండా సురేఖ భరోసా ఇచ్చారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామన్నారు.
కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 11,750 చేయూత పెన్షన్లు మంజూరయ్యాయని, ఇందుకోసం నెలకు రూ.2.94 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమవుతుందని కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

