కలం, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదరు మండలం నగరం గ్రామ పరిధిలో చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన (ONGC Gas Leak)పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాలప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ONGC ఛైర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి భద్రతా చర్యలపై సమీక్షించాలని సీఎం సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అంతకుముందు గ్యాస్ లీకేజీ అయిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ పరిశీలించారు. లీకేజీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఓఎన్జీసీ అధికారులతో సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ లీకేజీతో ఎలాంటి ప్రమాదం కలగలేదని, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, ఓఎన్జీసీ రిగ్ లో రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్ధంలో గ్యాస్ లీకైంది. భారీగా గ్యాస్ వెలువడుతుండడంతో (ONGC Gas Leak ) అధికారులు సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. బ్లో అవుట్ ను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఒక్కసారిగా భారీ శబ్ధంతో గ్యాస్ వ్యాపిస్తుండడంతో చుట్టు పక్కల ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది అటువైపు ప్రజలు రాకుండా చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న హైవేపైకి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

