కన్న తల్లి దారుణం.. 8 నెలల చిన్నారి గొంతు నులిమి హత్య

కలం, మహబూబాబాద్: కుటుంబ కలహాలు ఓ పసికందు ప్రాణాలను బలిగొన్నాయి. భర్త మందలించాడనే మనస్తాపంతో ఓ తల్లి తన ఎనిమిది నెలల కన్నకూతురి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా దామ్యతండా శివారులోని జేట్యాతండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

తండావాసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం నారాయణపురానికి చెందిన భారతి–కీమా దంపతుల కుమార్తె సుప్రజకు, జేట్యాతండాకు చెందిన బానోత్ బాలి–కిషన్ దంపతుల కుమారుడు భన్సీలాల్‌తో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల కుమార్తె త్రిష ఉంది. దంపతుల మధ్య తరచూ చిన్నచిన్న విషయాలకే గొడవలు జరిగేవి.

ఇటీవల భన్సీలాల్ సమీప బంధువు ప్రమాదంలో మృతిచెందడంతో, ఆయనకు సంబంధించిన బీమా పత్రాల కోసం తల్లి, సోదరితో పాటు శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లాడు. ఇంట్లో కుమార్తెతో ఒంటరిగా ఉన్న సుప్రజ పదేపదే భర్తకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తావని అడిగింది. దీంతో విసుగు చెందిన భన్సీలాల్ ఫోన్‌లోనే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సుప్రజ సోమవారం రాత్రి చిన్నారి త్రిష గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం ఇంట్లో ఫ్లోర్ క్లీనర్​ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన పక్కింటి బంధువులు వెంటనే 108కు సమాచారం అందించి ఆమెను మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ఘటన సమాచారం అందుకున్న మహబూబాబాద్ (Mahabubabad ) రూరల్ సీఐ అంజలి, కురవి ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి జేట్యాతండాకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>