కలం, ఖమ్మం బ్యూరో : చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రం (Anganwadi Center) దొంగలకు అడ్డాగా మారింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు (Mandalapadu) గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి బీభత్సం సృష్టించారు. కేంద్రంలోని వంట నూనె (ఆయిల్) ప్యాకెట్లు, కోడిగుడ్లను ధ్వంసం చేయడంతో పాటు, చిన్నారుల కోసం నిల్వ ఉంచిన బియ్యాన్ని దొంగిలించుకుపోయారు. ప్రభుత్వ పౌష్టికాహార సరుకులకే రక్షణ లేకపోవడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
ఈ కేంద్రంలో దొంగతనం జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే కేంద్రంలో చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకసారి చేదు అనుభవం ఎదురైనప్పటికీ, సంబంధిత అధికారులు గానీ, పాలకులు గానీ ఇప్పటివరకు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌గా రత్నకుమారి, సూపర్వైజర్గా అనురాధ విధులు నిర్వహిస్తుండగా, ఆయా పోస్టు ఖాళీగా ఉండటం, రాత్రి వేళల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం దొంగలకు వరంగా మారింది.
మరోవైపు, గ్రామ సర్పంచ్‌గా గాయం రమేష్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, గ్రామంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నారుల కేంద్రంలో వరుసగా చోరీలు జరుగుతున్నా శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదని, పంచాయతీ నిధులతో కేంద్రానికి పటిష్టమైన తలుపులు, కిటికీలు లేదా సీసీ కెమెరాల ఏర్పాటు వంటి భద్రతా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పసిపిల్లల కడుపు నింపాల్సిన పౌష్టికాహార సరుకులు దొంగల పాలవుతుంటే చూస్తూ ఊరుకోవద్దని, ఇప్పటికైనా సర్పంచ్ గాయం రమేష్, సంబంధిత ఐసీడీఎస్ అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్రానికి తగిన రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

