కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం (Kothagudem) పట్టణ ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరిందని, రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం మార్గంలో నిత్యం ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రధాన రహదారి విస్తరణకు 20 ఫీట్ల స్థలాన్ని కేటాయించేందుకు రైల్వే శాఖ అంగీకరించడం శుభపరిణామమని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ కోసం రైల్వే ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపి, వినతిపత్రాలు అందజేసినట్లు గుర్తు చేశారు. తమ నిరంతర కృషి ఫలితంగానే రైల్వే శాఖ సానుకూలంగా స్పందించి, విస్తరణకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.
విస్తరణతో పాటు రహదారిని మరింత సుందరంగా, ప్రయాణికులకు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం ఇప్పటికే రూ.కోటి నిధులు కేటాయించినట్లు కూనంనేని వివరించారు. విస్తరణ పనులు పూర్తయితే ప్రయాణికుల రాకపోకలకు ఎంతో ఊరట లభిస్తుందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కొత్తగూడెం పట్టణ సమగ్ర అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

