కలం, యాదగిరిగుట్ట : ప్రజల గోడు వినిపించే ప్రజావాణిలో మరోసారి సమస్యల వెల్లువ కనిపించింది. ఒక్కరోజే 147 మంది తమ సమస్యలను జిల్లా యంత్రాంగం ముందుంచారు. ఇందులో ఏకంగా 71 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలు ఎన్ని రోజులైనా పరిష్కారం కాకపోతే ప్రజావాణి నిర్వహణకు అర్థమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్న వేళ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanthi) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని అధికారులకు సూచించారు.
రెవెన్యూ శాఖకే 71 ఫిర్యాదులు.. ఎందుకీ పరిస్థితి?
మొత్తం 147 అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించినవే 71 ఉండటం ప్రత్యేకంగా నిలిచింది. భూములు, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మండల పరిషత్‌కు 17, గ్రామీణ అభివృద్ధి శాఖకు 11, సంక్షేమ శాఖకు 8, సర్వే అండ్ ల్యాండ్స్‌కు 7, మున్సిపాలిటీకి 7 అర్జీలు అందాయి. మిగిలిన శాఖలకు కూడా ఫిర్యాదులు చేరాయి.
బాలల సమస్యలకు ప్రత్యేక వేదిక
బాలల హక్కుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. పిల్లలకు ఎదురవుతున్న సమస్యలు, హక్కుల పరిరక్షణ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆదేశాలు అమలవుతాయా? ప్రజల్లో ఇదే ఆసక్తి!
ప్రజావాణిలో అర్జీలు స్వీకరించడం ఒక ఎత్తయితే.. వాటికి పరిష్కారం చూపడం మరో ఎత్తు. 147 అర్జీలకు సంబంధిత శాఖలు ఎంత వేగంగా స్పందిస్తాయి? ముఖ్యంగా 71 రెవెన్యూ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయన్నది వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, హౌసింగ్ పీడీ అలివేలు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

