కలం, భైంసా: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా తన వంతు సహకారం అందిస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) అన్నారు. సోమవారం భైంసా మండలంలో చేయూత పథకం కింద నూతనంగా ఎంపికైన వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ మంజూరు పత్రాలను (Pension Sanction Letters) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులకు పింఛన్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. గత పదేళ్లుగా పింఛన్లు అందక పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
అర్హత ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముధోల్ నియోజకవర్గంలో మొత్తం 4,606 మందికి పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేసుకున్నంత మాత్రాన పింఛన్లకు అనర్హులుగా ప్రకటించడం సరికాదన్నారు. వాటిని జీవనోపాధి కోసం కొనుగోలు చేసుకున్నవారికి కూడా అర్హతల ఆధారంగా పింఛన్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీరజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉపసర్పంచులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

