కలం, కరీంనగర్: కరీంనగర్లోని (Karimnagar) మాతా శిశు ఆసుపత్రిలో సోమవారం భోజన విరామ సమయంలో టీఎన్జీవోల (TNGOs) సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నర్సింగ్ ఆఫీసర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్లకు సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎన్జీవోల సంఘంలో సభ్యత్వం అంటే కేవలం పైసల సేకరణ కాదని, గుణగణాలున్న ఉద్యోగులను, నిబద్ధత కలిగిన నాయకులను, హక్కుల కోసం పోరాడే పోరాటయోధులను సమీకరించడమని అన్నారు. ఎనిమిది దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన టీఎన్జీవోల సంఘం ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
నర్సింగ్ ఉద్యోగులు సాధారణ ఉద్యోగులు కాదని, ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే సేవా సైనికులని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ, విషజ్వరాలు ప్రబలిన సమయంలోనూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలందించిన మహోన్నత సేవకులని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే నర్సింగ్ ఉద్యోగులకు ఏ ఆపద వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత టీఎన్జీవోల సంఘానిదని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఎవరైనా ఆటంకాలు కలిగించినా, ప్రభుత్వపరంగా వారికి రావాల్సిన హక్కులకు భంగం కలిగినా జిల్లా, రాష్ట్ర సంఘం అండగా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
టీఎన్జీవోల సంఘం క్రమశిక్షణకు, ఐక్యతకు మారుపేరని, ప్రభుత్వ ఆదేశాలను, ఉన్నతాధికారుల సూచనలను గౌరవిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. సంఘం పేరును ఉపయోగించి ఎవరూ అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడరాదని, సంఘం గౌరవ ప్రతిష్ఠలను కాపాడటం ప్రతి సభ్యుడి బాధ్యతని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతే సంఘానికి బలమని, ఉద్యోగుల సంక్షేమమే సంఘం లక్ష్యమని, ఉద్యోగులకు అన్యాయం జరిగితే పోరాటమే తమ మార్గమని దారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, నాయకులు కమలాకర్, లవకుమార్, కరుణాకర్, నారాయణ, గుండ రాజేష్, బండ అన్వేష్, ప్రకాశం, రాహేల్, రాజేష్, దిలీప్, ఉదయ్, సరోజ, రాధిక, షెర్లీ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

