కలం, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలంటే ఒక్కటే మార్గం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఆయన విదేశీ యాత్రలు మానుకుని.. గ్రామాల్లో పర్యటించడం ప్రారంభించాలని సూచించారు. అలా చేసి ప్రజల అభిమానాన్ని పొందితే.. ఏదో ఒక రోజు ఆయన ప్రధాని అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రపంచమంతా ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందిస్తుంటే.. రాహుల్ గాంధీ కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ చెప్పినట్లు ఆయన బాటలో నడిస్తే, మరో 30 ఏళ్లయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయాన్ని ఆలోచించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయేసరికి.. హస్తం పార్టీ అసహనంతో రగిలిపోతోందని ఎద్దేవా చేశారు.
అది భారత వ్యతిరేక సమ్మిట్..
హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ కార్యక్రమంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆ సమ్మిట్‌కు వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తులను దేశ విదేశాల నుంచి పిలిపించుకున్నారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) కూడా అక్కడకు వెళ్లారు. పేరుకు అది భారత్ సమ్మిట్. కానీ అక్కడ రాహుల్ గాంధీ దేశాన్ని కించపరిచేలా మాట్లాడారు. అంతర్జాతీయ సదస్సులో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ అవినీతి పాలన చూసిన ప్రజలు విసిగిపోయారు. వారిని అధికారంలో నుంచి దించేసి మోదీకి ప్రధాని పగ్గాలు అప్పగించారు. గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీపై ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కూడా రాలేదు” అని అమిత్ షా స్పష్టం చేశారు.

