కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission)నివేదికపై బిగ్ అప్డేట్ అందుతోంది. 2025 నవంబర్ 3న జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ త్రిసభ్య కమిటీకి ప్రభుత్వం 18 నెలల గడువు ఇచ్చింది. ఈ లెక్కన వచ్చే ఏడాది (2027) మే లేదా జూన్ నాటికి కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ప్రస్తుతం వివిధ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో సంప్రదింపులు జరుపుతున్న కమిటీ.. వేతన సవరణతో పాటు పింఛనుదారుల ప్రధాన డిమాండ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు ఈ నివేదిక అత్యంత కీలకం కానుంది. 8వ వేతన సంఘం నివేదిక ఆధారంగా 2.1 నుంచి 2.75 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు పదేళ్లకు బదులుగా ప్రతి ఐదేళ్లకోసారి వేతన సవరణ చేయాలని, కరవు భత్యం (DA/DR) 25 శాతం దాటితే బేసిక్‌లో విలీనం చేయాలని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు కమిటీ ముందు ప్రతిపాదించాయి. కమిటీ సిఫార్సులపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటే, 2026 జనవరి 1 నుంచి బకాయిలు కూడా అందే అవకాశం ఉంది. దీంతో 8వ వేతన సంఘం నివేదికపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

